ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చంద్రయ్య. ఊరు.. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్. నగర శివార్లలోని ఒక రిసార్టులో తోటమాలిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ప్రకటించడంతో రిసార్టు మూతపడింది. అక్కడ పనిచేసే వారిని ఖాళీ చేయాలని యాజమాన్యం చెప్పింది. దీంతో పిల్లాజెల్లతో మూటాముల్లె సర్దుకుని సొంతూరుకు కాలినడకన బయల్దేరాడు. వాహనాల రాకపోకలు బంద్ కావడంతో కుటుంబసభ్యులతో కలిసి కాలినడక 140 కిలోమీటర్ల దూరంలోని తన ఊరుకు తరలుతున్న ఆయన పరిగి సమీపంలో ‘సాక్షి’కి కనిపించారు.
చంద్రయ్యే కాదు.. అనేక వలస కుటుంబాల్లో కరోనా సృష్టించిన కల్లోలమిది. పొట్టచేత పట్టుకుని నగరాలు, పట్టణాలకు వచ్చిన పేదల బతుకులు కకావికలమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో వలసజీవుల బతుకు రోడ్డున పడింది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి రావడంతో సొంతూరు బాటపట్టారు. స్వగ్రామాలకు వెళ్లలేక కొందరు పట్టణాల్లోనే ఉండిపోగా, మరికొందరు మాత్రం పొట్టనింపుకోవడం కష్టమని భావించి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనాల్లేకపోవడంతో కాలినడకనే బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కొడంగల్, కోయిల్‌కొండ, సేడం, పరిగి, కుల్కచర్ల, గండీడ్, దౌల్తాబాద్, కోస్గి, అచ్చంపేట, నారాయణ్‌ఖేడ్, పెద్దేముల్, మునుగోడు, కర్ణాటకలోని గుర్మిట్కల్, యాద్గిర్ ప్రాంతాలకు నడిచి వెళ్తున్నారు. మరో 20 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనుండటంతో స్వస్థలాలకు వెళ్లడమే మేలని భావించినట్లు కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్‌కు చెందిన నంజప్ప తెలిపారు. కోవిడ్ జనసమ్మర్ధ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రబలే అవకాశం ఉందనే సంకేతాలు కూడా తాము సొంతూరు వెళ్లిపోవడానికి మరో కారణమని ఆయన చెప్పారు.
ఎలాగైనా వెళ్లాల్సిందే!
లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, రిసార్టులు, విద్య, వ్యాపారసంస్థలు మూతపడడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. దీంతో అత్తెసరు కూలీ పొందే వలసజీవులు కాలినడకన బయలుదేరగా.. కొంతమంది మాత్రం ద్విచక్ర వాహనాలపై సొంతూళ్లకు పయనమయ్యారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి మార్గాన ప్రయాణం సాగిస్తున్నారు. పోలీసుల చెక్‌పోస్టుల కళ్లుగప్పి వేరే దారుల్లో ఇంటికి చేరుతున్నారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల శివార్ల లో ఇతరులెవరూ ఊరిలోకి ప్రవేశించకుండా ముళ్లకంచెలు, అడ్డుగోడలు ఏర్పాటు చేయడంతో పిల్లబాటలు, పొలాల గుండా ప్రయాణాలు సాగిస్తున్నారు.