సీఎం జగన్‌తో ముగిసిన బీసీజీ ప్రతినిధుల భేటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై నివేదిక సమర్పించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ నివేదికలో ప్రస్తావించింది. అదే విధంగా అభివృద్ధి సూచీల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించింది. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించింది. అవి అనుకున్న లక్ష్యాలను సాధించాయా లేదా అన్న అంశాలపై గణాంకాలతో సహా వివరించింది. (సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ)












అదే విధంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్యరంగాల్లో ప్రణాళికలను సైతం బీసీజీ తన నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల బహుళ రాజధానుల గురించి నివేదికలో పేర్కొంది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది. రాష్ట్రం సత్వర ఆర్థికాభివృద్ధి, సత్వర ఫలితాల సాధనకై ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలో బీసీజీ తన నివేదికలో సూచించింది. కాగా రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.(జీఎన్‌ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్‌ కమిటీ)