నేడు జగన్‌ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం..

రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను సైతం అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుండడంతో తాజాగా వైఎస్‌ జగన్‌ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.